ప్రధాని ఆహ్వానిస్తే నమ్మలేదు.. ప్రధానమంత్రి ‘మన్‌కీబాత్‌’ వినాలని దేశమంతా ఎదురుచూస్తుంది.. కానీ.. కటక్‌ (ఒడిశా)లోని ఓ చాయ్‌వాలను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ప్రధాని మనసు తహతహలాడింది..

ప్రధాని ఆహ్వానిస్తే నమ్మలేదు..
ప్రధానమంత్రి ‘మన్‌కీబాత్‌’ వినాలని దేశమంతా ఎదురుచూస్తుంది.. కానీ.. కటక్‌ (ఒడిశా)లోని ఓ చాయ్‌వాలను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ప్రధాని మనసు తహతహలాడింది.. ఆ ఊరెళ్లగానే కబురుపంపి మరీ ఆయన్ని రప్పించుకున్నారు మోదీ.. ఇద్దరు చాయ్‌వాలాల తీయటి సంభాషణ చూసినోళ్లందరూ మురిసిపోయారు. అంతకుమునుపు మన్‌కీబాత్‌లో విన్నోళ్లందరూ ఆశ్చర్యపోయారు. మోదీ ట్వీట్‌ చూసి అబ్బురపడ్డారు. ప్రధాని మనసు గెలుచుకున్న ఆ చాయ్‌వాలా పేరు ‘దేవరపల్లి ప్రకాష్‌రావు’. కాకినాడ నుంచి కటక్‌కు వలస వెళ్లిన తెలుగోడు. ఇటీవలే ప్రధానిని కలిసిన నేపథ్యంలో.. తన రెండో కోణాన్ని ఆవిష్కరించాడిలా..

‘‘ఒడిశా రాష్ట్రం కటక్‌లోని బుక్సీబజార్‌లో నాకొక టీకొట్టు ఉంది. ఉదయాన్నే నిద్రలేచి పొయ్యి ముట్టించి.. చాయ్‌ మరిగించడంతో దినచర్య మొదలవుతుంది. మధ్యాహ్నం మురికివాడలో నడుపుతున్న స్కూలుకు వెళతాను. టీచర్లు, పిల్లల బాగోగులు తెలుసుకుంటాను. భోజనం సరిగా అందుతోందా? అని ఆరా తీస్తాను. దాదాపు రోజూ ఇవే నా కార్యకలాపాలు. కానీ, మే నెల 25 మాత్రం నాకొక ప్రత్యేకమైనది.
ఉదయం ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది..
‘‘హలో నమస్కారం.. ప్రకాష్‌రావుగారేనా మాట్లాడేది..’’
‘‘అవును. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా?’’
‘‘మేము ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నాం..’’
‘‘అయ్యో.. నమస్కారం సార్‌.. మీరు చెబుతున్నది నిజమేనా? నేను ఓ చిన్న చాయ్‌వాలాని. నాతో ఏంపని? నమ్మశక్యంగా లేదు’’
‘‘మీరు వింటున్నది నిజమే..! స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ గారే మీకు ఫోన్‌ చేయమంటే చేస్తున్నాం. ఆయన అధికారిక పర్యటనలో భాగంగా కటక్‌ వస్తున్నారు. మిమ్మల్ని కలవాలనుందని చెప్పారు. మిగిలిన వివరాలన్నీ కలెక్టర్‌ చెబుతారు..’’

అదీ ఆ ఫోన్‌ సంభాషణ. ప్రధాని రమ్మనటం ఏంటి? నమ్మలేకపోయాను. అంతలోనే కలెక్టర్‌ నుంచి మరో ఫోన్‌. ‘రావుగారూ.. మీకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఖరారు చేశాం. మీతోపాటు మీ స్కూలు పిల్లల్నీ తీసుకురావొచ్చు’ అన్నారు కలెక్టర్‌. మరుసటి రోజే ప్రధాని కటక్‌ వస్తున్నారు. తెల్లారితే ఆయన్ని కలవాలి. మనం నమ్మిన ఒక మంచి పనిని చేసుకుంటూపోతే.. ఎప్పుడో ఒకప్పుడు మంచి రోజు వస్తుందని విశ్వసించే మనిషిని నేను. ఆరేళ్ల వయసులో ఈ టీకొట్టులో కాలు పెట్టి.. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో.. ఒకసారి నెమరేసుకుంటే.. ఎన్నో జ్ఞాపకాలు. అవన్నీ మీతో పంచుకుంటే కానీ ప్రధాని నన్ను ఎందుకు ఆహ్వానించారో అర్థం కాదు.

మా ముత్తాతల సొంతూరు కాకినాడ దగ్గరున్న రేచర్లపేట. తాత అప్పలస్వామి. నాన్న కృష్ణమూర్తి. సెంటు భూమి లేదు. మా తాత కాకినాడలో బతకలేక దేశాటనకు బయలుదేరాడు. కాలినడకన వచ్చి కటక్‌లో ఆగిపోయాడు. ఆ ఊర్లోనే నాన్న పుట్టాడు. ఆయన కూడా చిన్నప్పటి నుంచి కూలీనే. దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం గడ్డు పరిస్థితులు ఉండేవి. ఉపాధి దొరికేదే కాదు. చేసేది లేక మిలిట్రీలో చేరాడు నాన్న. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. అందులో చాలామంది భారతీయ సైనికులు చనిపోయారు. నాన్న మాత్రం ఎనిమిదేళ్ల తరువాత కటక్‌ తిరిగి వచ్చాడు. ఆయనకు మద్యం లేనిదే పూట గడిచేది కాదు. ఇంట్లోని వస్తువులన్నీ అమ్మి తాగేవాడు. చేతిలో డబ్బుల్లేవు. కేవలం ఐదురూపాయల పెట్టుబడితో బుక్సీబజార్‌ అనే మురికివాడలో టీకొట్టు పెట్టాడు. అప్పటికి నా వయసు ఆరేళ్లు. టీకొట్టులో పనిచేస్తూనే.. పదకొండో క్లాసు వరకు లాగించాను. ఫీజులు కట్టేందుకు డబ్బుల్లేక చదవలేకపోయా. కుటుంబం దుర్భర పరిస్థితుల్లో ఉన్నప్పుడే.. నాన్న పోయాడు. నాకు మిగిలింది ఈ టీకొట్టు ఒక్కటే! దాంతోనే కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చాను.

పేదరికం కారణంగా చదువుకోలేని పిల్లల్ని చూసినప్పుడు.. నా బాల్యం గుర్తుకొచ్చేది. బుక్సీబజార్‌లో రిక్షావాలాలు, ఆటోవాలాలు, దిన కూలీలు, కార్మికులు, మున్సిపాలిటీ వర్కర్లు.. ఇలా అంతా పేదలే. తల్లిదండ్రులు పనులకు వెళుతూ పిల్లల్ని పట్టించుకునేవారు కాదు. ఆ పిల్లలు ఆకతాయిలుగా మారి.. జూదం, తాగుడు, పేకాట, బిక్షాటనకు అలవాటుపడ్డారు. మరికొందరైతే దొంగతనాలకు కూడా పాల్పడేవారు. బుక్సీబజార్‌ అంటేనే ఒక చెడు ముద్ర పడిపోయింది. ఆ దయనీయ దృశ్యాలన్నీ చూసి- పేదరికాన్ని తొలగించాలంటే చదువు ఒక్కటే మార్గం అనిపించింది. ఆ చదువు లేకనే కదా నేనిక్కడ టీకొట్టుకే పరిమితం అయ్యాను. మేము రెండుగదుల ఇంట్లో ఉండేవాళ్లం. ఒక గదిని పాఠశాలగా మారిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. మా వీధిలోని పిల్లలతోనే స్కూలు మొదలుపెడదామని.. వాళ్ల తల్లిదండ్రులకు విషయం చెప్పాను.

‘‘ఏదో ఒక పని చేసుకుంటూ అంతో ఇంతో సంపాదిస్తున్న మా పిల్లల్ని ఎందుకు చెడగొడతావు?’’ అంటూ కసురుకున్నారు. అవేవీ నేను పట్టించుకోలేదు. ఒకరిద్దరు పిల్లలు వచ్చినా సరేననే ధైర్యంతో.. పాఠశాల ప్రారంభించా. మెల్లగా పిల్లలు రావడం మొదలైంది. టీచర్లను ఏర్పాటు చేశాను. అసలే పేద పిల్లలు. బడికి వస్తే తిండి ఉండదు. అందుకని పొద్దున్నే రాగానే గ్లాసు పాలు, బిస్కెట్లు ఇచ్చేవాణ్ణి. చూస్తుండగానే పిల్లల సంఖ్య పెరిగింది. మధ్యాహ్నభోజనం కూడా మొదలుపెట్టాను. ఇప్పుడు బడి నిండా పిల్లలే! మా బడిని సందర్శించిన వాళ్లందరూ ‘రూపాయి ఫీజు తీసుకోకుండా.. సొంత డబ్బుతో ఎలా నడపగలుగుతున్నావు?’ అనడిగేవాళ్లు. టీకొట్టులో రోజుకు ఆరువందలు వస్తుంది. అందులో సగం కుటుంబానికి, మరో సగం స్కూలుకు వెచ్చిస్తున్నాను. పద్దెనిమిదేళ్లుగా ఒంటి చేత్తోనే పోరాడుతూ వస్తున్నా. ఏటా ఎంతోమంది పిల్లల చదువు కుంటుపడకుండా కాపాడాను. ‘చాయ్‌వాలా స్కూలు నడుపుతున్నాడా? ఏదీ చూద్దాం పద’ అంటూ ఆ మధ్య ఇద్దరు విదేశీయలు సైతం ఇక్కడికి వచ్చారు. స్కూల్లో కొన్ని నెలలుండి.. పిల్లలకు కంప్యూటర్‌ పాఠాలు చెప్పి వెళ్లారు.

నాలో ఇంకో కోణం ఉంది. అదీ చెబుతా. 1976లో నేను అనారోగ్యం పాలయ్యాను. బతకననే అనుకున్నారు కుటుంబ సభ్యులు. అర్జంటుగా రక్తం ఎక్కించాలన్నారు వైద్యులు. ఎక్కడ వెదికినా నా గ్రూపు రక్తం దొరకలేదు. ఆఖరికి ఎవరో ఒక దాత స్పందిస్తే రక్తం దొరికింది. ఆర్నెల్ల్లు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని.. బతికి బయటపడ్డాను. అప్పుడు రక్తదానం విలువ తెలిసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న రెండేళ్లకు – రక్తదానానికి పూనుకున్నాను. ఇప్పటికి 215 సార్లు రక్తం ఇచ్చా. ఆస్పత్రిలో నేను పడిన కష్టాలు ఊరికే ఉండనీయలేదు. నా భార్య కటక్‌లోనే ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి పేషెంట్లకు సహాయపడుతుంటా. నా సేవకు మెచ్చి అనీబిసెంట్‌ అవార్డుతో పాటు, మానవహక్కుల అవార్డును కూడా ఇచ్చారు. ‘నువ్వు మురికివాడలోని పేదలకు చదువు చెప్పిస్తున్నావు కదా. ఈ మధ్య వచ్చిన రజనీకాంత్‌ ‘కాలా’ చూశావా?’ అనడుగుతున్నారు మా దోస్తులు.. అది కూడా నాలాంటి కథే అయినందుకు తప్పక చూస్తానని చెబుతుంటా. నాకిప్పుడు అరవైఏళ్లు. టీకొట్టుతోనే ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లు చక్కగా స్థిరపడ్డారు. పద్దెనిమిదేళ్ల నుంచి స్కూలు నడుపుతున్నాను. వందల మంది పిల్లలు ప్రయోజకులు అయ్యారు. సేవ చేయాలంటే సంపాదన ఉండక్కర్లేదు. మనసుంటే మార్గం ఉంటుంది.

ఇక, ఆ రోజు ప్రధానిని కలిసినప్పటి సంగతి ఇప్పుడు చెబుతా వినండి…
‘‘ఆవో ఆవో రావూజీ’’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించారు. ఆయన అప్పుడే కటక్‌లో మీటింగు ముగించుకుని కాస్త బడలికగా కనిపించారు. నేనేమో ఉత్సాహంతో మా బడి పిల్లల్ని వెంటబెట్టుకుని అతిథిగృహానికి వెళ్లాను. ‘‘చాయ్‌వాలా అయ్యుండి.. ఇంతమంది పిల్లల్ని చదివిస్తున్నావంటే నీకు ఎన్ని అభినందనలు చెప్పినా తక్కువే రావూజీ’ అన్నారాయన. ‘‘పెద్దయ్యాక ఎవరెవరు ఏమేం అవుతారో చెప్పండి’’ అంటూ పిల్లిల్ని అడిగారు. ఒకమ్మాయి సింగర్‌ అవుతానంది. ఏదీ ఒక పాట పాడు అన్నారు ప్రధాని. ఆ అమ్మాయి కమ్మని హిందీగీతం పాడుతుంటే ప్రధాని కళ్లలో సంతోషం మెరిసింది. ‘‘సార్‌, మీరు మా స్కూలుకు రావాలి. అక్కడ మాతో కలిసి భోంచేయాలి’ అని పిల్లలు అడిగారు. ‘‘తప్పక వస్తా’’ అన్నారు మోదీ. ఆయన మాతో దిగిన ఫోటోను ట్వీట్‌ చేశారు. మమ్మల్ని కలవడానికంటే ముందే రేడియో ప్రసంగం ‘మన్‌కీబాత్‌’లో నా గురించి ప్రస్తావించారు. అలా.. దేశమంతా నా పేరు మార్మోగిపోయింది. నరేంద్రమోదీ కూడా ఒకప్పుడు చాయ్‌వాలానే.. ఆ తీపి బంధమేదో మమ్మల్నిద్దరినీ కలిపింది’’ అంటూ నవ్వుతూ ముగించారు దేవరపల్లి ప్రకాష్‌రావు.

ప్రకాష్‌రావును హీరోను చేశారు మోదీ. ఆయన సేవకు దేశమంతా చప్పట్లు కొట్టింది.
..బాగానే ఉంది.
ప్రధాని కటక్‌ వచ్చినప్పుడు పిలిచి మరీ.. శభాష్‌ అంటూ అభినందించారు.
..బాగానే ఉంది.
టీవీ చానళ్లు ‘చాయ్‌వాలా సక్సెస్‌ స్టోరీ’ని పోటీపడి చూపించాయి.
..బాగానే ఉంది.

అయినా..
ప్రకాష్‌రావు మనసులో ఏదో గుబులు. ఆ డెబ్భైమంది పిల్లల గురించే. ఆఖర్న ఒక మాట అన్నాడు గద్గద స్వరంతో. ‘‘ఈ అభినందనలు, ప్రశంసలు కాదయ్యా నాకు కావాల్సింది. పద్దెనిమిదేళ్ల నుంచి ఎంతో శ్రమకోర్చి ఒక చిన్న గ్యారేజ్‌లాంటి ఇంట్లో స్కూలు నడుపుతున్నాను. ఎవరైనా నాలుగు గదుల స్కూలు కట్టించి పుణ్యం కట్టుకోండి. నాకేమో వయసు మీద పడింది. నేను పోతే.. నా పిల్లలు రోడ్డున పడకూడదు..’’. ప్రకాష్‌రావు కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
అప్పటి వరకు కటక్‌లోని బుక్సీబజార్‌కే చాయ్‌వాలాను. కానీ, ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌కీబాత్‌’లో నా కథ దేశప్రజలకు వినిపించినప్పటి నుంచి.. ఒకటే అభినందనలు. ఫోన్లు. పలకరింపులు. ప్రధాని కటక్‌ వచ్చినప్పుడు.. నన్ను పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఇద్దరు చాయ్‌వాలాలు ఒక చోట కలవడం అద్భుతమే కదూ!

పేరు : దేవరపల్లి ప్రకాష్‌రావు
ఒకటో కోణం : చాయ్‌వాలా
రెండో కోణం : విద్యాదాత, రక్తదాత.
– సండే డెస్క్‌

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s